Chandra Mohan : సీనియర్ నటులు, కథనాయకుడు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.చంద్రమోహన్ సైతం గత కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతున్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని ఇంట్లోనే భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
పెద్ద స్టార్ హీరోలతో సమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అటు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. హాస్య నటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రమోహన్. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న నటులలో చంద్రమోహన్ ఒకరు. దాదాపు 55 సంవత్సరాల పాటు నటిస్తూనే ఉన్నారు.
గత కొంత కాలం గా సినిమాలకు దూరం గా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతూ వచ్చిన చంద్రమోహన్, ఇలా హఠాత్తుగా చనిపోవడం అందరినీ శోకసంద్రం లోకి నెట్టేసింది. ఈ ఏడాది ప్రారంభం లో కళాతపస్వి కె విశ్వనాధ్ చనిపోయినప్పుడు చివరి చూపు చూడడానికి కోసం వచ్చి గుండెలు బాదుకుంటూ ఏడ్చిన చంద్ర మోహన్ ని మనమంతా చూసే ఉంటాము. ఏమిటి ఈయన ఇంత వీక్ అయిపోయాడు అని చూసిన ప్రతీ ఒక్కరు అనుకున్నారు. కానీ ఇలా జరగుతుంది అని మాత్రం ఊహించలేకపోయారు.
తండ్రి పాత్రలు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది చంద్ర మోహనే. ఆయన్ని చూస్తే మన తండ్రి గుర్తుకు వస్తాడు. అంత సహజం గా నటించే వ్యక్తి ఆయన. గత కొంతకాలం గా సినిమాలకు దూరం గా ఉంటూ రావడం తో చంద్ర మోహన్ లేని లోటు అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేనిది, ఆయన ఏ లోకం లో ఉన్నా ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.