NTR: సీనియర్ ఎన్టీఆర్ హనుమంతుడి పాత్ర చెయ్యడానికి అంతలా భయపడడానికి కారణం అదేనా?

Posted by venditeravaartha, May 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

NTR: తెలుగు ప్రజలతో పాటు, తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం చిరస్థాయిగా మన మదిలో నిలిచిపోయే యుగపురుషులలో ఒకరు నందమూరి తారక రామారావు. సినీ రంగం లో దిగ్గజం గా కొనసాగి, ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, తానూ పోషించలేని పాత్ర అంటూ ఏది లేదు, ఒకవేళ ఏదైనా పాత్ర మిస్ అయితే ఆ పాత్రకి అదృష్టం లేనట్టే అని నిరూపించుకున్న మహానుభావుడు ఆయన. రాముడైన, కృష్ణుడైనా, రావణాసురుడు అయినా, దుర్యోధనుడైన, అర్జునుడు అయినా, కర్ణుడు అయినా ఇలా ఏ పౌరాణిక పాత్ర తీసుకున్నా, బహుశా వీరంతా ఇలాగే ఉండేవారేమో అని అనిపించే స్థాయి ముఖ వచ్చస్సు ఎన్టీఆర్ సొంతం. అందుకే ఆయనని ఆంధ్రులు ఆరాధ్య దైవం లాగ భావిస్తారు. ఆ ఆదరణతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తెలుగు దేశం పార్టీ ని స్థాపించి, కేవలం 8 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు, సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టి పేదప్రజల పాలిట దేవుడైన ఎన్టీఆర్ జయంతి నేడు.

ఈ సందర్భంగా ఆయనకీ సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. అదేమిటంటే ఎన్టీఆర్ ఇప్పటి వరకు అన్నీ రకాల పాత్రలు పోషించాడు కానీ, పౌరాణికాలు, ఇతిహాసాలలో అతి ముఖ్యమైన పాత్రలైనా నారదుడు, హనుమంతుల పాత్రలు చెయ్యలేదు. ఆ రోజుల్లో షూటింగ్ సమయాల్లో ఎక్కువగా కరెంటు పోతూ ఉండేది. ఆరోజుల్లో కరెంటు లేకపోతే షూటింగ్ కార్యక్రమాలు జరిగేవి కాదు. మళ్ళీ తిరిగి కరెంటు వచ్చే వరకు ఆరు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారట ఆర్టిస్టులు. అలా ఒక రోజు ఎన్టీఆర్ కూడా అలా బయట కూర్చొని పౌరాణికాలు గురించి మాట్లాడుతూ ఉండేవారట.

ఒక రోజు డైరెక్టర్ ‘అన్నగారు..మీరు దాదాపుగా అన్నీ పాత్రలు పోషించారు. కానీ నారదుడు, హనుమంతుడి పాత్రలు ఎందుకు చెయ్యలేదు అని అడగగా, దానికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ ‘నాకు నారద పాత్ర చెయ్యాలనే ఉంది బ్రదర్. అందరూ ఆయనని ఒక కోణం లో మాత్రమే చూపించారు. కానీ నాకు ఆయన ఎంత పరమ భక్తుడో చూపించాలని ఉండేది. కానీ నా కటౌట్ ఆ పాత్రకి సరిపడదు అందుకే చెయ్యలేదు. ఇక హనుమంతుడి పాత్ర కూడా నా ముఖానికి సెట్ అవ్వదు. మాస్క్ వేసుకొని నటించాలి. ముఖ కవళికలు ప్రేక్షకులకు అర్థం అయ్యేవి కాదు. అందుకే ఆ పాత్ర చెయ్యలేదు’ అని చెప్పుకొచ్చారట. ఇకపోతే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా లో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ ఆయనని స్మరించుకుంటూ జయంతి శుభాకాంక్షలు తెలియచేసారు.

Tags :
259 views