చిరంజీవి సినిమా పై అసంతృప్తి – “నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ తిట్టారు!”

Posted by venditeravaartha, November 2, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజా రవీంద్ర: “చిరంజీవి ఆ సినిమా చేయడం నాకు నచ్చలేదు… నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తిట్టారు!”

Raja Ravindra: సీనియర్ నటుడు రాజా రవీంద్ర అందరికీ సుపరిచితమైన పేరు. ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా, పలు స్టార్ హీరోలకు మేనేజర్‌గా కూడా వ్యవహరించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి సినీ వర్గాల్లో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఆసక్తికరంగా ఈ బంధం ఒక గొడవతోనే ప్రారంభమైందట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ —
“కె.ఎస్. రవికుమార్ గారు నన్ను తమిళంలో పరిచయం చేశారు. నేను చేసిన మొదటి ఐదు సినిమాలకు ఆయనే దర్శకుడు. ఒకసారి ‘స్నేహం కోసం’ సినిమా కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఆయన నన్ను ఫోన్ చేశారు. ‘చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ తెలియరు, నువ్వొకసారి లొకేషన్‌కి రా’ అన్నారు.

వెళ్లాక ఆయన ‘స్నేహం కోసం’ తమిళ్ వెర్షన్ చూసావా? అని అడిగారు. నేను చూడలేదన్నాను. అప్పుడు ఆయన డీవీడీ ఇచ్చారు. ప్లేయర్ లేదన్నాను, ఆయనదాన్నే ఇచ్చి చూడమన్నారు. చూసిన తర్వాత నేను ఆయనతోనే అన్నాను —
‘ఇది చిరంజీవి గారు చేయడం సరైంది కాదు. రజినీకాంత్ గారు తమిళంలో ఉన్న స్థాయి, మన దగ్గర చిరంజీవి గారి స్థాయి ఒకటే. అక్కడ శరత్‌కుమార్ చేసిన సినిమా తీసుకొచ్చి చిరంజీవి గారితో చేయడం సరిగ్గా అనిపించట్లేదు. ఆయన పాత్రలో చిరంజీవి గారు చేతులు కట్టుకుని నిలబడటం కూడా కరెక్ట్ కాదు, ఆయన కొడుకు కూడా అలాగే నిలబడటం అంత బాగోలేదు’ అన్నాను.”

రాజా రవీంద్ర చెప్పిన ఈ మాటలు రవికుమార్ గారు చిరంజీవికి చెప్పారట. “లంచ్ టైంలో చిరంజీవి గారు నన్ను పిలిచి ‘ఏమన్నావు నువ్వు డైరెక్టర్‌కి?’ అని నిలదీశారు. అంతే కాదు, నిర్మాత ఏ.ఎం. రత్నం గారి కారులోకి తీసుకెళ్లి ‘ఇదేమైనా భీమవరం అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేస్తున్నారు’ అంటూ క్లాస్ పీకారు,” అన్నారు రాజా రవీంద్ర.

“దాంతో నేనూ కొంచెం ఆగ్రహంగా ‘సరే సార్, మీ సినిమా చూసి నా అభిప్రాయం చెప్పినందుకు ఇలా అంటారా? ఇక నేను రాను’ అన్నాను. కానీ తర్వాత చిరంజీవి గారే ఫోన్ చేసి రమ్మన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక రవికుమార్ వెళ్లిపోయారు… కానీ నేను మాత్రం చిరంజీవి గారి దగ్గరే ఉండిపోయాను,” అని రాజా రవీంద్ర ఆ సంఘటనను ముగించారు.

ఇలా ఒక చిన్న అపార్థం వల్ల ప్రారంభమైన గొడవే… తర్వాత చిరంజీవి–రాజా రవీంద్ర మధ్య బలమైన స్నేహబంధానికి కారణమైంది.

Tags :
155 views