Pawan Kalyan : ఇటీవలే తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ కి సంబంధించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ జాబితా పై ఇరు పార్టీలలో అస్సమ్మతి సెగలు ఏ రేంజ్ లో అలుముకున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టీడీపీ పార్టీ లో కొన్ని చోట్ల మాత్రమే నిరుత్సాహం ఉన్నప్పటికీ, జనసేన పార్టీ కి మాత్రం అన్నీ స్థానాల్లో కార్యకర్తల నుండి అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
24 స్థానాలు అంటే జనసేన పార్టీ కి చాలా తక్కువని, అనేక స్థానాలలో పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి నిలబడిన వారికి టికెట్స్ ఇవ్వలేదని, ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ కి గుండెకాయ లాంటి కందుల దుర్గేష్ కి కూడా రాజమండ్రి స్థానం దక్కకపోవడం దురదృష్టకరమని, అలాగే తణుకులో జనసేన పార్టీ ని తిరుగులేని శక్తిగా మలిచిన విడివాడ కి కూడా సీటు ఇప్పించలేకపోవడం పవన్ కళ్యాణ్ చేతకానితనం కి నిదర్శనం అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మండిపడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రకటించిన ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చెయ్యకపోవడం అభిమానులను ఇంకా తీవ్రమైన నిరాశకి గురి అయ్యేలా చేస్తుంది. చంద్రబాబు నాయుడు నాన్ స్టాప్ గా తన అభ్యర్థుల జాబితాని మంత్రాలు చదివినట్టు చదువుతుంటే, పవన్ కళ్యాణ్ బిక్క మొహం వేసుకొని చూడడం శోచనీయం అని అభిమానులు వాపోతున్నారు. అదంతా పక్కన పెడితే ఆయన పోటీ చెయ్యబోయే స్థానం ఏంటో ఇంకా ఖరారు చేసుకోకపోవడం దురదృష్టకరం అంటూ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యడం లేదు, కాకినాడ నుండి ఎంపీ కి పోటీ చేసి, కేంద్ర మంత్రి పదవి పై ఫోకస్ పెట్టాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం లో ఉంది. అలాగే భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నిన్న హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసం లో సుమారుగా రెండు గంటల వరకు చర్చలు జరిపారు. అంటే భీమవరం నుండి జనసేన అభ్యర్థిగా అంజి బాబు పోటీ చేయబోతున్నాడా అనే సందేహాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. ఇవి రెండు కాదు, పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం, తిరుపతి లో పోటీ చేయబోతున్నారని టాక్ కూడా ఉంది. మరోపక్క ఆయన తిరుపతి ఎమ్మెల్యే గా పోటీ చేస్తూనే, కాకినాడ ఎంపీ స్థానం కి కూడా పోటీ చేస్తాడని అంటున్నారు. వీటిలో ఏది నిజం, ఏది అబద్దం అనేది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు.