Pavala Syamala: జబర్దస్త్ షోతో స్టార్ కమెడియన్ అయిపోయాడు హైపర్ ఆది. ఆయనపై సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ షోలో ఓ స్కిట్లో భాగంగా చనిపోయిన వారి పక్కన తన ఫోటోను పెట్టి చనిపోయినట్లుగా చిత్రీకరించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్కిట్ చూస్తే తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. రంగస్థలం నుంచి వెండితెరపైకి వచ్చిన పావలా శ్యామల తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం పావలా శ్యామల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనారోగ్యం కారణంగా ఆదుకునే వారికోసం తాను ఎదురు చూస్తున్నారు. తనతో పాటు తన కూతురు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని శ్యామల చెబుతోంది. శ్యామల పరిస్థితిని బయట ప్రపంచానికి చెప్పేందుకు పలు యూట్యూబ్ ఛానళ్లు ఆమెను వరుసగా ఇంటర్వ్యూ చేస్తున్నాయి. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి స్పందించింది.

గతంలో కూడా పావలా శ్యామల చనిపోయిందని తప్పుడు కథనాలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అయితే నేను చనిపోలేదు, బతికే ఉన్నాను.. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తానే చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు కారణం ఒకరిద్దరు కాదు.. అందరూ ఇలాగే ఉన్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు అలా ఉంటే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ‘జబర్దస్త్’ లాంటి షోలో కూడా చనిపోయిన వారి ఫోటోల పక్కన తన ఫోటో పెట్టి చనిపోయినట్లు చిత్రీకరించడం బాగాలేదని.. మనసు కలత చెందిందని పేర్కొంది. ‘జబర్దస్త్‌లో హైపర్ ఆది అని ఉంటాడు కదా.. యాంకర్ రష్మీని అడుగుతున్నాడు. నిర్మలమ్మ ఫొటో, మనోరమ ఫొటో, పక్కన నా ఫొటో కూడా పెట్టి.. ఈవిడ ఎవరో నీకు తెలుసా.. ఈవిడ కూడా ఇప్పుడు లేరన్నంతగా చెప్పేశాడు. ఇలా చేయడం వల్ల వారికి ఏం లాభం? నేను నడవలేకపోతున్నాను. అలాంటప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి ఎందుకు అలా మాట్లాడావు, నీతో ఎవరు మాట్లాడించారని నేను అడుగలనా.. నాకు ఆది దొరుకుతాడా.. పోనీ ఫోన్ చేసి బతికే ఉన్నావా అని అడిగాడా అని బాధపడింది శ్యామల.
తాను బతికే ఉన్నానని అందరికీ తెలుసు.. అయినా ఇలాంటి పనులు చేసి బాధపెడుతున్నారు. ‘ఒక్కడే గనుక ఇలాంటి తప్పు చేస్తే వెళ్లి అడగొచ్చు. పోరాడొచ్చు. పెద్దవాళ్లకు చెప్పి బుద్ధి చెప్పించొచ్చు. కానీ అందరూ ఇలాగే మాట్లాడుతూ.. చచ్చిపోయానని పుట్టించేవాళ్ల అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడగలమా? నాకేం తెలుసమ్మా ఫలానా ఆయన చెప్పాడని దాటేస్తారు. ఎవరితో దెబ్బలాడగలుతాం? అలాంటి వెధవలతో మాట్లాడితే మన పరువే పోతుంది. సంస్కారం ఉన్న వాళ్లయితే అలా మాట్లాడరు. ఒకరు కిందపడి ఏడుస్తుంటే వాళ్లను తొక్కుకుంటూ పోయే వాడు వెధవతో సమానం. చేయి అందించి పైకి లేపేవాడే మానవత్వం ఉన్నవాడని పావలా శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.