ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ: మరో 15 ఏళ్లు కూటమిదే అధికారం – పరిటాల శ్రీరామ్

Posted by venditeravaartha, October 13, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా):

తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, మునికూడలి గ్రామం సోమవారం ఉత్సవ వాతావరణంలో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం (ఎన్.డి.ఎ.) రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అన్ని వర్గాల అభివృధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల బల రామకృష్ణ గారితో కలిసి, RUDA చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి & రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు బొబ్బిలంక నుంచి మునికూడలి వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

ఎన్టీఆర్ ది ఓ చరిత్ర – బొడ్డు వెంకటరమణ చౌదరి

RUDA ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయనో చరిత్ర అని, తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారని కొనియాడారు. టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ నాయకులు తెలిపారు.

Tags :
91 views