Chiranjeevi : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి గత ఎన్నికలలో సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు ఎవ్వరూ కూడా మద్దతుగా రాలేదు కానీ, ఈసారి మాత్రం ప్రతీ ఒక్కరు తమ గొంతుకుగా మారి పవన్ కళ్యాణ్ కి సపోర్టు చేస్తున్నారు. రాజకీయాలకు దశాబ్ద కాలం నుండి దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తొలిసారి తన తమ్ముడి గెలుపు కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పిఠాపురం లో పోటీ చెయ్యబోతున్న తన తమ్ముడి కోసం సపోర్టుగా ఒక వీడియో ని విడుదల చేసారు.
‘అమ్మ కడుపునా చివరగా పుట్టిన బిడ్డ. కానీ జనాలకు కష్టం వస్తుందంటే మాత్రం అందరికంటే ముందు ఉండే వ్యక్తి మా కొణిదెల పవన్ కళ్యాణ్. పదవి లో ఉన్నప్పుడు జనాలకు మేలు చెయ్యడం కాదు, పదవి లేకపోయినా నా తమ్ముడు ఎంతో సేవ చేసాడు. కౌలు రైతులకు వాడు సహాయం చేసిన తీరు, సైనిక్ బోర్డుకి విరాళం అందించిన విధానం, మత్స్యకారులకు ఆర్ధిక సహాయం చెయ్యడం వంటివి నా గుండెని కదిలించాయి. ఏ తల్లికి అయినా తన బిడ్డని తిడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నయ్య కి అయినా అదే విధమైన బాధ కలుగుతుంది. మా అమ్మ బాధపడుతుంటే నేను ఒక్కటే చెప్పాను. వాడు నీలాంటి తల్లితండ్రుల కోసం ఎంతో మంది కోసం పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఓర్చుకో అని ధైర్యం చెప్పాను. చేతిలో ఏ పదవి లేనప్పుడే కళ్యాణ్ ఇంత చేసాడు. అదే అతని చేతిలో పవర్ ఉంటే, చట్టసభల్లో అతని గొంతు వినిపిస్తే రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది. కాబట్టి పిఠాపురం లో పోటీ చేస్తున్న నా తమ్ముడికి ఓట్లు వేసి గెలిపించండి’ అంటూ చిరంజీవి విడుదల చేసిన వీడియో కి అపూర్వమైన స్పందన లభించింది. మరోపక్క ఆయన ఈ నెల 11 వ తారీఖున పిఠాపురం కి వచ్చి పవన్ కళ్యాణ్ తరుపున ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.