Rajini Kanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా రజనీకాంత్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. అయినా ఇటీవల వచ్చిన జైలర్ సినిమాతో ఆ లోటు అభిమానులు తీర్చేసి.. తన పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. తమిళనాడులో రజినీ కాంత్ ఫోటో లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయనను తమిళ తంబీలు ఆరాధిస్తారు.

ఇది ఇలా ఉంటే.. తమ అభిమాన హీరో ఫ్యాన్స్ తెగ తాపత్రయ పడుతుంటారు. వాళ్ల సినిమాలను ఫస్ట్ షో చూసేందుకు ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటారు. వారి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది సినిమా అభిమానంలో భాగం. అయితే కొందరు మాత్రం అంతకు మించి అనేంతలా తమ అభిమాన హీరోలను, హీరోయిన్లను విగ్రహాలుగా భావించి పూజలు కూడా నిర్వహిస్తుంటారు. వారు వారికి భక్తులుగా మారిపోతారు. తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారు. గతంలో చాలా మంది హీరోలు, హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
గతంలో హీరోయిన్లు కుష్బూ, నయనతార, సమంత, నీధి అగర్వాల్ లాంటి వాళ్లకు తమ ఫ్యాన్స్ గుళ్లు కట్టి పూజలు చేసేవారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఓ అభిమాని గుడి కట్టాడు. నిత్య పూజలు చేస్తున్నాడు. మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తి రజనీకాంత్‌కు వీరాభిమాని. ఆయన గుడి కట్టి అందులో 250 కిలోల విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహం కింద తన తల్లిదండ్రుల ఫొటో, గణేశుడి ప్రతిమను ఉంచాడు.
ప్రతిరోజు విగ్రహానికి పూజ చేయడం అలవాటు చేసుకున్నాడు. తనకు రజనీకాంత్ ను దేవుడితో సమానంగా భావిస్తానని చెప్పాడు. తాను రజనీకాంత్ భక్తుడినని చెప్పుకునేందుకు గర్వపడుతానన్నాడు. ఇది రజనీకాంత్‌కు చేరిందో లేదో కానీ కార్తీక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.