టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సాయి పల్లవి ఒకరు. ‘ప్రేమమ్’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ సినిమాతో అలరించింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘ఎం.సి.ఎ’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘తండేల్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఎంతగా గుర్తింపు వచ్చినా వరుసగా సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన సాయి పల్లవిలో కనిపించదు.
అంతేకాకుండా, నటనతో పాటు ఆమె డాక్టర్ కోర్సును కూడా పూర్తి చేసింది. సినిమా ఎంపికలో ఆమెకు పాత్రకు ప్రాధాన్యత. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తానని ఆమె తరచూ చెబుతూ ఉంటుంది. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అవకాశం వచ్చినా, పాత్ర నచ్చలేదని తిరస్కరించింది.
ఇప్పుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ్’ లో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరామునిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే సాయి పల్లవి లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన పొందింది.
ఈ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి రూ.12 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుండగా, ఆ రెండు భాగాలకూ కలిపి ఈ మొత్తం పారితోషికం చెల్లించనున్నారు. బాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే, ఇది పెద్ద మొత్తమే కాదు. అక్కడ కొంతమంది టాప్ హీరోయిన్లు రూ.20 నుంచి రూ.25 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటున్నారు.