WPL 2024: కుదిరితే ఫోర్, లేకుంటే సిక్స్.. 190 రన్స్ ను ఉఫ్ మని ఊదేసింది

Posted by venditeravaartha, March 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

WPL 2024: దూకుడు, బీభత్సం, అనితర సాధ్యం, అనన్య సామాన్యం.. తెలుగులో ఎన్ని ఉపమానాలు ఉంటే అన్ని.. అవన్నీ సరిపోవేమో.. హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టిన ఫోర్ లకు, బాదిన సిక్సర్లకు స్టేడియం చిన్నబోయింది. ప్రత్యర్థి బౌలర్లలో నీరసం ఆవహించింది. ఫలితంగా 190 పరుగుల భారీ లక్ష్యం కూడా గాలికి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి గుజరాత్, ముంబై జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్లో.. ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టి20 మజా అందించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. గుజరాత్ జడ్పీ కెప్టెన్ బేత్ మూనీ(66), హేమలత (74) ధాటిగా బ్యాటింగ్ చేయడం.. చివరి ఓవర్లలో ఫుల్మాలి(21) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ జట్టు 1990 పరుగులు చేసింది.. ముంబై బౌలర్లలో సైక ఇషాక్ 2 వికెట్లు తీసింది, హీలి మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజ వస్త్రకర్, సంజన తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో 191 పరుగులు పూర్తిచేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముంబై కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. దూకుడుగా బ్యాటింగ్ చేసి 95 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. హర్మన్ కు భాటియా అద్భుతమైన తోడ్పాటు అందించింది. భాటియా 36 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు వ్యత్యాసంతో 50 పరుగుల ఘనతను పోగొట్టుకుంది. ఇక గుజరాత్ జట్టు బౌలర్లలో గార్డ్ నర్, తనూజ, షబ్నం తలా ఒక వికెట్ తీశారు.

చివరి ఓవర్లో అద్భుతం

హర్మన్ ఎంత ధీటుగా బ్యాటింగ్ చేసినప్పటికీ చివరి ఓవర్ లో ముంబై జట్టుకు 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ ను గార్డ్ నర్ వేసింది. దీంతో స్టేడియంలో అభిమానులు ముని వేళ్ళ మీద నిలబడ్డారు. ఎందుకంటే అప్పటికే హర్మన్ అలసిపోయింది. గార్డ్ నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఇక అంతే సంగతులని అభిమానులు ఒక అంచనాకొచ్చారు. కానీ వారందరి అంచనాలను హర్మన్ తలకిందులు చేసింది. తొలి రెండు బంతుల్లో వరుసగా 6, 4 బాది ముంబై జట్టు ఆటగాళ్లు, అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత మూడు బంతుల్లో వరుస సింగిల్స్ తీసి.. ముంబై జట్టును గెలిపించింది.. ఇక ఈ మ్యాచ్లో హర్మన్ ముంబై జట్టుకు అవసరమైన భాగస్వామ్యాన్ని అమేలియా కేర్ తో కలిసి నెలకొల్పింది. హర్మన్, అమేలియా కలిసి నాలుగో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. ఇక తన దూకుడయిన బ్యాటింగ్ తో ముంబై జట్టును గెలిపించిన హర్మన్ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకుంది. ఇక ఈ విజయంతో ముంబై జట్టు తన ఖాతాలో ఐదు గెలుపులను నమోదు చేసుకుంది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. హర్మన్ బ్యాటింగ్ దూకుడు నేపథ్యంలో.. శనివారం రాత్రి నుంచి ట్విట్టర్ ఎక్స్ లో ఆమె పేరు అత్యంత చర్చనీయాంశమైన జాబితాలో చేరింది.

414 views