తెలుగు సినిమా ప్రేక్షకులు కమెడియన్లను విపరీతంగా ఆదరిస్తారు. అందుకే బ్రహ్మానందం లాంటి నటులు అత్యున్నతస్థాయికి ఎదిగారు. కామెడీ ప్రధానంగా వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈమధ్య వస్తున్న చాలా సినిమాల్లో కామెడీ కనిపించలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో కామెడీ ఆకట్టుకుంది. అందుకు ప్రధాన కారణం సత్య. ఈయన సినిమా రిలీజ్ కు ముందే సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన స్పూప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకదశలో ఆయన కామెడీని చూసే చాలా మంది సినిమా థియేటర్లకు వచ్చారని అనుకుంటున్నారు. అయితే సత్య కామెడీ ట్రాక్ ఎక్కడ మొదలైంది? ఆయన ఏ సినిమాతో ఫేమస్ అయ్యారో తెలుసుకుందాం..
అమలాపురం పట్టణానికి చెందిన సత్య బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సినిమాపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చాడు. సాధారణంగా చిత్ర పరిశ్రమకు వచ్చేవారు హీరో కావాలని ఆశపడుతారు. కాన సత్య మాత్రం డైరెక్టర్ కావాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలు చేస్తుండగా నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ అనే సినిమాకు పనిచేసే అవకాశం దొరికింది. ఆ తరువాత అమృతం అనే కామెడీ సీరియల్ కూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ఈ సమయంలో అతనికి కమెడియన్ ధన్ రాజ్ పరిచయం అయ్యాడు. అప్పటికే ఫేమస్ కమెడియన్ అయిన ధన్ రాజ్ బజర్దస్త్ లో కొనసాగుతున్నాడు. దీంతో సత్యను జబర్దస్త్ లోకి తీసుకెళ్లి తన టీంలో పెట్టుకున్నాడు. సత్య తన టాలెంట్ ను షో చేయడంతో ఇక్కడ ఫేమస్ అయ్యాడు. ఇంతలో అతనికి సినిమా నుంచి నటించే ఆఫర్లు వచ్చాయి. వీటిలో స్వామి రారా అనే సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో ఆయన జబర్దస్త్ ను వీడి సినిమాలకే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నారు.
అక్కడి నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగిన సత్య ఓ వెబ్ సిరీస్ లో హీరోగా నటించారు. అదే ‘వివాహ భోజనంబు’. ఈ సినిమా కామెడీ పరంగా బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆయన మరో సినిమాలో హీరో అవుతారని అనుకున్నారు. కానీ సత్య మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతీ పాత్రలో నటిస్తున్నాడు. ఇలాగే కామెడీతో దూసుకుపోతూ సత్య మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం..