Vishwak Sen : దాదాపు ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన విశ్వక్ సేన్ గామీ సినిమా ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు.. ప్రేక్షకుల్లో కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హీరో విశ్వక్ సేన్ మీడియాతో తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ.. తాను లైలా అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. నిజానికి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసి తానే దర్శకత్వం కూడా వహిస్తున్నానని గతంలో చెప్పిన విశ్వక్.. ఇప్పుడు దిల్ సుఖ్ నగర్‌కు చెందిన ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెకండాఫ్‌లో తాను ఎక్కువ సేపు లేడీ గెటప్‌లోనే ఉంటానని వెల్లడించారు. నిజానికి గతంలో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శివ కార్తికేయన్, మంచు మనోజ్ లాంటి నటులు మాత్రమే ఫుల్ లెంగ్త్ లేడీ గెటప్ రోల్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రయోగాలు ఏ కుర్ర హీరో చేయలేదు. అయితే ఇప్పుడు వీరి బాటలోనే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయబోతున్నాడనేది హాట్ టాపిక్ అవుతుంది. ఇక విశ్వక్ సేన్ గామీ చిత్ర విషయానికి వస్తే విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి, దయానంద రెడ్డి, మయాంక్ పరాక్, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషించనున్నారు.